విజయనగర సంస్థాన చరిత్ర...
ప్రాచీన కాలమునుండియూ విజయనగర సంస్థాన భూఖండము కళింగ దేశములో ఒక భాగము. తదుపరి బాదామి చాణుక్యులు, వేంగీ
చాణుక్యులు (కీ.శ.615-1100) వరకూ పాలించారు. తదుపరి గాంగ వంశీయులు పాలించారు. త్రిలింగపరమేశ్వరులగు కాకతీయుల బావుటా కొంతకాలము రెపరెపలాడింది. పదునాలుగు పదిహేనవ శతాబ్ద సంధికాలములొ రెడ్డి రాజులు రాజమహేంద్రవరం తట ప్రాంతాల్లో విజయస్థంభములు నిలిపి కొంతకాలం కళింగ, చిల్కసముద్రప్రాంతము మొదలైన ప్రాంతములు పాలించారు.
(1568-1652) మధ్యలో గోలుకొండ నవాబుల దాడుల వలన కొంత భాగము వారి ఏలుబడిలొ ఉండేది. చికాకోలులొ తమ ఫౌజుదారుల పరముగా (1652-1687) మధ్య పాలించారు. 1687-1724 మధ్యలో మొగలాయి పాలన తదుపరి స్వతంత్రుడయిన నిజాము అధికారము లోనికి వచ్చింది. వీరి కాలమునందే బొబ్బిలి, విజయనగర సంస్థానములు రూపొందాయి. 1753-1758 మధ్య హైదరాబాద్ నిజాము ఉత్తర్వులు ప్రకారము ఫ్రెంచ్ వారి పాలన తదుపరి1766 నుండి బ్రిటీష్ వారి ఏలుబడి లోనికి వచ్చింది. 1766-1794 మధ్యకాలంలో బ్రిటిష్ వారి సైన్యము సహకారముతో ఇరుగు పొరుగు మన్యపు సంస్థానములు ఏదొ ఒక మిషతొ విజయనగర పాలకులచే ఆక్రమింపబడి విజయనగర సంస్థానము అంచెలంచెలుగా విస్తరింపబడినది.
1794 లొ జరిగిన పద్మనాభ యుద్ధం తదుపరి దేశీయ సేనలు రద్దు చేయుటవలన విజయనగర సంస్థానము ఆక్రమణలొకల సంస్థానములు మరలా సంబంధిత వంశీయులకు తిరిగి ఇచ్చుటవలన సంస్థాన విస్తీర్ణము ప్రాభవము కొంత మేరకు తగ్గనది. 1802లొ జరిగిన శాశ్వత పరిష్కారం వలన ఈ సంస్థానము బ్రిటిష్ వారి అధికారము క్రింద ఒక జమీందారీగా గుర్తింపు పొందినది.ఆధునిక కాలంలో జమీందారీ రద్దుతొ ఈ సంస్థానము ఆంధ్రప్రదేశమున ఐక్యమయినది. ఈ సంస్థానము అత్యుచ్ఛదశలొ మూడువేల చదరపు పైగా వైశాల్యము కలిగి ఉండేది.
పూర్యపాలకులు గడించినది 57 పరగణాల రాజ్యము. 1845లొ 13 ఠాణాలు కలిగి ఇంచుమించు రెండు వేల చదరపు మైళ్ల వైశాల్యము ఉండేది.1938 నాటికి విశాఖపట్టణ మండలములొగల 181 జమీందారీలలొ ప్రాచీనమైన జమీందారీలు ముప్పదియారు. విజయనగర సంస్థానము సుమారు పదమూడు వందల గ్రామములతొ పది లక్షల జనాభా కలిగియుండేది.1802లొ కప్పము అయిదు లక్షలు రాబడి ఏడు లక్షలు. సంస్థానము రద్దు కాల సమయమునాటికి సుమారు ముప్పది లక్షలు. విజయనగరం, భీమునిపట్టణం, శ్రృంగవరపుకోట తాలుకాలు పూర్తిగానూ , అనకాపల్లి, గజపతినగరం, చీపురుపల్లి, పాలకొండ, విశాఖపట్నం, వీరవల్లి, సర్వసిధ్ధి తాలూకాలలొ కొన్ని ప్రాంతములు ఈ సంస్థానము వ్యాపించి ఉండేది. తూర్పుగోదావరి మండలములొని కోటిపల్లి, శ్రీకూర్మము దగ్గర కల హీరమండలము మున్నగు ఎనిమిది ఎష్టేటులు ఈ జమీందారీ ఏలుబడిలొ ఉండేవి.
ఈ సంస్థాన పాలకుల పూర్వపు రాజధాని కుమిలి( కుంబిళాపురము) గ్రామము. తదుపరి పొట్నూరు రాజనివాసము. బొబ్బిలి యుధ్ధ కారకులుగా ప్రసిద్దుడైన పెదవిజయరామరాజు గారి కాలమున గాజులరేగ శివారులలొ విజయరామరాజు విజయానికి చిహ్నంగా రూపొందిన విజయనగరం ఈ సంస్థానమునకు తదుపరి రాజధాని. ఈ సంస్థానములొ కోటిపల్లి, పద్మనాభము, రామతీర్థం, శ్రీకూర్మము, సింహచలము మొదలగు దేవాలయములకు విజయనగర జమీందారుల వంశపారంపర్యంగా ధర్మకర్తలు. భారతదేశసంస్థానములలొ అతికొంతమందికి లభించే ఫిరంగి కాల్పుల గౌరవ వందనము పొందుటకు అనుమతించబడిన జమీందారీ విజయనగర సంస్థానము మాత్రమే.
ఈ సంస్థాన పాలకులు కమలాప్తవంశమువారు. ఇక్ష్యాకు వంశీయుడయిన శ్రీరాముని తనయుడగు కుశుని సంతతికి చెందినవారు. వీరు తొలుత ఇనకులము వారలయి, కాశ్యపగోత్రులయిన విప్రశాపవశత కాల్మాషాపాది వాసిష్ఠుడగుటచే అతని సంతతి వారందరూ వాసిష్ఠులయినారట. వసిష్ఠగొత్రజులయందు విభాగములొ శిశోడియా శాఖనుండి తామరతంపరగా వీరు వర్థిల్లారు. ఉత్తర భారతదేశమున ప్రవర్థమానములయిన తొంబది తొమ్మిది రాజపుత్ర శాఖలలో ప్రసిద్ధి చెందిన ఉదయపురి ( మేవాడు) రాజులు విజయనగర పాలకుల పూర్వులు. ఉదయపురము, కచ్ వహొ, చావడా, ఝాలా , పుంకారా , బారీ , సోలంకి మున్నగు ఉత్తరభారత క్షత్రియ కుటుంబములతొ విజయనగర పాలకులకు సంబంధ బాంధవ్యములు కలవు.
పూసపాటి గృహనామము :-
విజయనగర పాలకుల ఇంటిపేరు పూసపాటి వారు. భీముని సంతతిలొ అమలరాజు కొండపల్లి సీమలొ పూసపాడు గ్రామవాస్తవ్యులగుట వలన ఈ కులము వారికి పూసపాటి అను ఇంటిపేరు సంక్రమించినదని ఒక కధనము , పూష ( సూర్య) వంశుల నివాసభూమియగుటచే ఒక పట్టణము పూషవాట మను పేర ప్రసిద్ధి మయినది. అదియే తద్వాస్తవ్యులగు పాలకుల గృహనామముగా ప్రవర్థిల్లనదని మరియోక కధనము.
పరిచ్ఛేది సంజ్ఞ:-
ఆంధ్రక్షత్రియ శాఖలలో వసిష్ఠగొత్రజులగు పూసపాటి వారు పరిచ్ఛేది సంజ్ఞాతులు. మైలమాంబ దేవవర్మల తనయుడు మైలభీమాపరనామ విథ్యాతుడునగు
చిక్కభీముడు పూసపాటి మూలపురుషులందొకరు.
అనేక శతాబ్దముల పూర్వము ఉదయపురిపాలకుల సోదరుడగు విజయభూపతి స్వీయరాజ్యమును వీడిన సూర్యవంశీయుల తొలి రాజధాని యగు అయోధ్యకు వెళ్లి దానిని జయించి కొంత కాలము పాలించి క్రీ.శ. ఆరవ శతాబ్దమునందు దక్షిణ భారతదేశమునకు తరలివచ్చి కర్ణాటక సీమయందు నేడు బీజాపురమున్న స్థలంలో కొటను నిర్మించి పరిపాలించేరు. ఈ విజయపురమే అనంతరకాలమునందు బీజాపురము అయినది.
ఈ విజయభూపతి దక్షిణ భారతదేశమునకు తరలివచ్చినపుడు కాశ్వప, కౌండిన్య,ధనంజయ, భరద్వాజ గోత్రములకు చెందిన క్షత్రియ కుటుంబములను తనవెంట తీసుకుని వచ్చెననియు వారే నేటి ఉత్తర సర్కారులలొని 129 గృహనామములు కల క్షత్రియులందరికీ పూర్వపురుషులు.
దేవవర్మ మైలమాంబ కుమారుడు చిక్కభీముడు. ఈయనే మైలభీముడనియు,ఏరువభీముడనియు చాటుకృతులలో విఖ్యాతుడు. మైలభీముని సంతతి యందు అమలరాజు ముఖ్యులు. అమలరాజునకు అక్కమాంబ వలన అయిదుగురు కొడుకులు. వీరిలొ మధ్యముడగు అయ్యపరాజు కులవిస్తారకులు.ఈయనకు ఇరువురు కుమారులలొ తమ్మిరాజు రాజ్యపాలకులు.
ఈ సుతత్రయమునందు ఆఖరి వారు రాచిరాజుగా చరిత్రలొ ప్రసిద్ధి పొందారు.
ఈయన చాళుక్య వీరరాజ స్థాపనాచార్య బిరుదము పొందినట్లునూ , దేవరాయభూపతి సమ్మినులుగా రాజ్యమేలినట్లు మరియు దామెదరాధీశతిమ్మన భూపాలుని ఓడించి మన్య సుల్తాను బిరుదము పొంది సాహిత్యము సాక్షమిచ్చుచున్నది. ఇతనికి దంతులూరు ఎర్రమరాజు పుత్రిక సూరమాంబికను వివాహం చేసుకున్నారు. వీరికి కలిగిన ముగ్గురు కుమారులలో తమ్మిరాజు ఇమ్మడి తమ్మిరాజు గా ప్రసిద్ధము. ఈ తమ్మిరాజు నందాపురము పరిసరముల గజపతీంద్రుల పుత్రులను ఓడించినందున గజపతి నామము పొందారు. ఈయన మువ్వుర పుత్రులలొ రెండవ రాచిరాజు(1500-1550) కటక అధిపతి ప్రతాపరుద్రగజపతిచే పొందిన కేతవరము అను పట్టణము పొంది పాలించుటచే కేతవరపుర నాయకులు, మొగతుర్తి రాజధానీంద్రులు ,మొగలితుర్రు మణికిరీటులు అను బిరుదులను పొందారు.
రెండవ రాచిరాజు గారి తమ్ముడు లిప్పరాజు ఇతని మొదటి భార్య గొట్టెముక్కల అన్నమరాజు పుత్రిక మల్లమ్మదేవి, రెండవ భార్య చింతలపాటి ఉద్దండరాజు పుత్రిక గోపమాంబ. రెండవ భార్యవలన కలిగిన ముగ్గురు కుమారులలో అగ్రజుడు పెదక్రిష్ణభూపతి, ఈయన సొదరులు రాచిరాజు మరియు తమ్మిరాజు. పెదక్రిష్ణభూపతికి భార్య తిమ్మాంబ వలన పెదజగన్నాధరాజు, చినజగన్నాధరాజు అను ఇద్దరు పుత్రులు. ఇందులో పెదజగన్నాధరాజునకు క్రిష్ణమరాజు, రామరాజు అను ఇరువురు పుత్రులు.జయపురము విక్రమదేవు గారితో బంధువు బాహుబలీంద్రులను పొట్నూరు, భోగాపురం సీమలను ఈ క్రిష్ణమరాజు ఆక్రమించి కుమిలి గ్రామంలో కోటను కట్టించారు. ఈ స్థలదుర్గము వలన కుంభిళాపురనికేతులు అను బిరుదము పొందారు.ఈయనకు జగన్నాధరాజు, అన్నమరాజు అను ఇరువురు పుత్రులు. ఈ అన్నమరాజు భార్య వెంగళాంబకూ క్రిష్ణమరాజు, గోపాలకృష్ణరాజు అను ఇరువురు పుత్రులు.
ఇందులో క్రిష్ణమరాజు నకూ భార్యయగు గొట్టెముక్కల కేశమాంబకూ అన్నమరాజు, వెంకటపతిరాజు (1669-1720),ఆనందరాజు (1671-1717) అను ముగ్గురు కుమారులు . ఇందులో ఆనందరాజును మొదటి ఆనందరాజుగా వ్యవహరించారు.పెదక్రిష్ణభూపతి కనిష్ఠ కుమారుడగు చినజగన్నాధరాజు రెండవ పుత్రుడు భూపాలరాజు. ఇతని మూడవ కుమారుడు కొండ్రాజు. ఈ కొండ్రాజు పెద్ద కొడుకు రఘనాధరాజు (1620-1685) ఈయనకు మాధవవర్మ అనియు చినతమ్మిరాజు అని నామాంతరములు కూడా ఉన్నాయి.
ఈ రఘునాధరాజు మొదట గోల్కొండ నవాబుల కొలువులొ గొప్ప సర్దారు. అదే కొలువు నందు ఫౌజుదారులగు షేర్ మహమ్మద్ ఖాన్ సిఫార్సుపై కొండపల్లె సర్కారు నందు కొంతకాలము సర్దారుగానూ తదుపరి ఖాన్ అనుగ్రహముతో భోగాపురము ఆస్థానముగా మరికొన్ని గ్రామములకు సొంతందారులయి ప్రసిద్ధి చెందారు. రఘునాధరాజు కుమారుడు సీతారామచంద్రుడు జయపురము వారి సర్దారు (1669-1672) గా నుండి వారినుండి కుమిలి , గండ్రేడు, దేవుపల్లి పరగణాలు బహుమతిగా పొంది పొట్నూరు రాజధానిగా ప్రాముఖ్యతగా వచ్చింది. మొగలు బాదుషా ఔరంగజేబు నుండి "జుల్ ఫికారు " (రెండు మొనల కత్తి ) బహుమతి పొందారు. ఈయనకు సంతానము లేనందున కేశమాంబ క్రిష్ణమరాజు మూడవ పుత్రుడును మొదటి ఆనందరాజుగా దత్తత తీసుకున్నారు. ఆనందరాజు పసివారగుటవలన అన్నమరాజు తదుపరి వెంకటపతిరాజు అధికారము నిర్వహించారు. అనంతరం ఆనందరాజు పాలనకు వచ్చారు. ఈయన1717 లొ మరణించుటచే ఇతని అన్నయగు వెంకటపతిరాజు కుమారుడు సీతారామరాజు రాజ్యమునకు వచ్చి కిమిడి వారితో స్నేహము వలన పూడిమటక , బొంతపల్లి మొదలైన పదునాలుగు పరగణాలు సంపాదించారు.
సీతారామరాజుకు ఆనందరాజు కుమారుడగు విజయరామరాజు (1670-1757)నకు మనస్పర్థలు కలుగుటవలన ఆనాటి చికాకోలు ఫౌజుదారు అన్వరుధ్ధీన్ (1725-1740) సర్దుబాటు చేసి సీతారామరాజునకు దేవుపల్లి కోటను విజయరామరాజునకు విజయనగరమును పంపకము చేశారు.
ప్రతాపగిరి రాజుతొ యుద్ధమునందు సీతారామరాజు మరణించుటచే ఆయన కుమారుడు రెండవ ఆనందరాజు రెండేళ్ల పసివారగుటవలన దేవుపల్లి రాజ్యము తిరిగి విజయరామరాజు చేతికి వచ్చినది.
ఈయన పెదవిజయరామరాజుగా ఫ్రెంచ్ సేనాని బుస్సీదొర కు మిత్రులుగానూ బొబ్బిలి యుధ్ధమునకు మూలకారకుడుగా చరిత్రకెక్కారు. నిజామునుండి మీర్జా, రాజా, మన్యసుల్తాను వంటి బిరుదము పొందారు. ఈయన మొదటి భార్య చింతలపాటి రాచరాజు పుత్రిక చంద్రమాంబ, రెండవ భార్య పాకలపాటి సింహద్రిరాజు పుత్రిక రాజమాంబ.
బొబ్బిలి యుద్దావసానమున 1757లొ పెదవిజయరామరాజు తాండ్రపాపారాయునిచే హతులుకాగా అతని పెద్ద తండ్రి పౌత్రుడు సీతారామరాజు పుత్రుడు యగు రెండవ ఆనందరాజు (1732-1760) రాజ్యమునకు వచ్చారు. ఈయన ఆంగ్లేయులు తొ చెలిమిచేసి కర్నల్ ఫోర్డు దొర నాయకత్వమున కల ఆంగ్ల సేనల సహకారముతో ఉత్తర సర్కారులొని సంస్థానాధీశ్వరులను వశపరచుకుని ఫ్రెంచి వారిని పారద్రోలారు. ఈ జైత్రయాత్ర సందర్భంగా కులదేవతయగు బెజవాడ కనకదుర్గమ్మను కొలచి తిరివచ్చుచుండగా మార్గమధ్యంలో మశూచిసోకి రాజమండ్రి లొ 1760 లొ మరణించారు. దేవీపూజాదురందరులయిన వీరిని పూజాలొపమున దుర్మరణం పొందినట్లు కధనము కూడా కలదు.
స్వర్గీయ ఆనందరాజు నకు సంతానము లేనందున మరియు ఆయన ఇరువురు భార్యలు సహగమనము చేయుట మూలముగా పెదవిజయరామరాజు దేవేరియైన రాణీ చంద్రయ్యమ్మగారు విజయనగర పాలకుల జ్ఞాతివర్గములోని ఒక బాలుని విజయరామరాజు అను పేరున నిజాముగారి అనుమతితో దత్తతగా తెచ్చి రాజవంశమును నిలబెట్టారు.మొదటి ఆనందరాజు తండ్రి అయిన అన్నమరాజునకు జ్యేష్ఠ సొదరుడయిన జగన్నాథరాజు గారి పౌత్రుడైన రామభద్రరాజు. వీరు తాళ్లాయపాలెం వాస్తవ్యులు. ఈయనకు మొదటి భార్య వలన సీతారామరాజు, రెండవ భార్యయగు బంగారుతల్లి వలన వెంకటపతిరాజు(1749-1794) సంతానము. ఈ వెంకటపతిరాజునే రెండవ విజయరామరాజు అనుపేరున చంద్రయ్యమ్మగారు దత్తతకు తెచ్చారు. ఈయన దత్తతకు వచ్చునాటికి పదకొండు ఏండ్ల బాలుడు. ఈతని సవతియన్న సీతారామరాజు గొప్ప వ్యవహరదక్షుడు. పసివాడయిన తమ్మునకు బదులుగా ఈ సీతారామరాజు గారు సుమారు పాతికేళ్లు తన కత్తికి ఎదురులేని విధముగా రాజవ్యవహరములు చేపట్టి పరిపాలన చేశారు. కృష్ణా మహనదీ మధ్యనున్న రాజులందరూ సామంతులుగా కప్పము చెల్లించేవారు. విజయనగర ఔన్నత్యము సహింపని మన్యపురాజులందరూ జయపురాధీశ్వరుడగు విక్రమదేవు నాయకత్వమున విజయనగర వినాశనమునకు కుట్రలు చేయగా సీతారామరాజు వారి కుట్రలను తెలుసుకుని వారి సీమలను ఆక్రమించి వారినందరినీ ఖైదు చేశారు. అన్నగారికి ఎదురు చెప్పలేని విజయరామరాజు నామమాత్రంగా పాలకుడిగా ఉండి చివరకు ఇంగ్లీషు వారి సహకారముతో అన్నయగు సీతారామరాజును దీవాను పదవినుంచి బర్తరఫ్ చేసి తాను స్వయంగా పరిపాలన చేశారు.
ఇంత శక్తివంతమైన రాజులు తమకు వశులైననూ ఏదోఒకనాడు తమ మనుగడకు ముప్పుకలుగునన్న భయము ఇంగ్లీషు వారియందు ఉండేది. అందువలన తమకు చెల్లించవలసిన కప్పపు బకాయిలు సరిగ్గా చెల్లించక తమపై కుట్రలు చేయుచున్నారన్న కుంటిసాకులతొ రాజ్యమును వదలిపోవాలని విజయరామరాజు పై ఇంగ్లీషు వారు ఒత్తిడి చేయగా ఆయన ప్రతిఘటించారు అందుకు పర్యవసానమే 1794 జూలై నెలలో జరిగిన పద్మనాభ యుద్ధం. ఉత్తర సర్కారు లొని సాగి, చింతలపాటి, జంపన,దంతులూరి , దాట్ల, పెనుమత్స, వత్సవాయ, వేజెళ్ల మున్నగు గృహనామములుగల క్షత్రియవంశపు వీరులు విజయరామరాజుతొ పాటుగా అధర్మయుధ్ధమునందు దుర్మరణంపొందారు. బ్రిటిష్ అధికారులు విజయనగరసంస్థానము వారి ఆక్రమణయందుగల మన్యపు సంస్థానములన్నీ మరలా వాటిని పూర్వపాలక వంశీయులకు అప్పగించి విజయనగర ప్రాధాన్యతను క్షీణపరచారు.
మహరాజా విజయరామరాజు పద్మనాభయుద్ధం లొ మరణాంతరం ఆయన ఎనిమిది ఏండ్ల కుమారుడు నారాయణగజపతి తల్లి సీతయ్యమ్మతొ పాటుగా కాకర్లపూడి బాపిరాజు, కోలగట్ల పట్టాభిరామయ్య బాసటగా మరికొంత రాణుల తోడుగా మన్యప్రాంతములకు పారిపోయి కాశీపురము పాలకులు ముఖీ రాజభూపాలరాజును ఆశ్రయించారు.తదుపరి మక్కువ పరగణాలొ నివాసము ఏర్పరుచుకున్నారు. బ్రిటిష్ వారు ఎన్ని హమీలు ఇచ్చిననూ నారాయణగజపతి కొండలపైనుండి క్రిందికి దిగి రాలేదు. చివరకు విజయనగరం వచ్చిననూ నివసించుటకు ఇష్టపడలేదు. బ్రిటిష్ వారు నారాయణగజపతి గారితొ 1802 లొ సాలీనా ఐదు లక్షల రూపాయలు కప్పముతొ ఒడంబడిక జరిగింది. అంతటితో రాచరికము అంతమయి జమీందారీ పాలన ప్రారంభమయింది .
విజయనగర సంస్థానమునకు నారాయణగజపతి మొదటి జమీందారులు. ఈ గొడవలు సంస్థానము నందు అవకతవకలు మూలముగా సంస్థానము అప్పుల్లో మునిగిపొయింది.
ఈ చికాకులు చిక్కులు భరించలేక నారాయణగజపతి 1817-1822 మరియు 1827-1845 మధ్యలో సంస్థానమును బ్రిటిష్ ప్రభుత్య పర్యవేక్షణకు వదలి సాలుసరి లక్ష రూపాయల భృతిపై కాశీపురము నందు నివసించుచూ 1845 లొ అచ్చటనే మరణించారు.
నారాయణగజపతికి అప్పలకొండయాంబ వలన కలిగిన కుమారుడు విజయరామగజపతి (1826-1879). తండ్రి మరణాంతరం 1845లొ జమీందారీ హక్కు సంక్రమించిననూ 1852 వరకూ సంస్థాన పాలన బ్రిటిష్ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంది.తదుపరి విజయరామగజపతి సంస్థాన పాలనను స్వీకరించారు. 1864 లొ మహరాజా బిరుదును, 1866లొ K.C.S.I బిరుదము మరియు13 ఫిరంగుల కాల్పుల గౌరవ వందన మర్యాదయును, 1874 లొ " His Highness" బిరుదమును పొందారు. మూడు పర్యాయములు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయి కీర్తి ప్రతిష్టలు పొందారు. వీరి సహధర్మచారిణి కశ్వప గొత్రజులగు భేఖూ సింహరాజుల కుమారియగు రాణీ అలకరాజేశ్వరీ గారు.
విజయరామగజపతి అలక రాజేశ్వరీ దంపతుల జ్యేష్ఠ పుత్రిక అప్పలకొండయాంబ ఈమె వింధ్యాద్రిపాద భూములలొ బాగేల్ ఖండమునందు రేవా సంస్థాన పాలకులు సోలంకి రఘరాజసింహ మహరాజు.G.C.S.I (1854-1880) యోక్క పుత్రుడు మధొఘడ్ పాలకులు మహరాజా రామరాజసింహ గారిని వివాహం చేసుకున్నారు కానీ చిన్న తనమునందే వైధవ్యము పొంది విజయనగరము నకు వచ్చి రాజకార్యములందు సొదరుడయిన ఆనందగజపతి (1850- 1897)గారికి సహకరించారు. తండ్రి విజయరామగజపతి 1879 లొ మరణాంతరం జమీందారీ భాధ్యతను చేపట్టారు.
1881 లొ మహరాజా బిరుదము, 1887 లొ K.C.I.C బిరుదము,1892 లొ G.C.I.E. బిరుదమును పొంది 1884 , 1894 లొ శాసన నిర్మాణ సభా సభ్యత్వము పొంది ఆంగ్లేయులచే ' జగన్మోహనుడు' (Prince Charming) అని కీర్తింపబడ్డారు. ఉత్తర హిందుస్తానము నందలి జయపుర సంస్థాన పాలకులు శ్రీరామసింహ కామాధిపతి దంపతుల పుత్రిక బనేకుమారి ( వనకుమారీ దేవి - ఛోటా మహరాణీ ) ఆనందగజపతి గారి భార్య. మహరాజా ఆనందగజపతి నడివయస్సునందే 1897లొ నిస్సంతువుగా మరణించుట వలన జమీందారీ హక్కుల కొరకు వారసులయందు వివాదములు మొదలయ్యాయి. ఆనందగజపతి మేనమామ (అలక రాజేశ్వరీ సోదరుడు) యొక్క రెండవ కుమారుని ఆనందగజపతి తన మరణమునకు మూడు సంవత్సరాల ముందు ఒక దసరా ఉత్సవము సందర్భంగా దత్తత స్వీకరించారని, మరణకాలమునకు నాటికి కొన్ని నెలల ముందు ఈ దత్తతనకు సంబంధించిన వీలునామా రిజిష్టరయి ఉండెను. సంస్థానపు హక్కు కొరకు సమీప బంధువు పెద జగన్నాధరాజు గారి రెండవ కుమారుడు రామరాజు కొవకు చెందిన పూసపాటిరేగ శాఖ కుమారవెంకటపతిరాజాదులు వివాదము లేవనెత్తుట వలన 1897 - 1904 మధ్య సంస్థానము కోర్టు ఆఫ్ వార్డు వశమున ఉండినది.
విజయనగర ఆస్థాన కవి పండితులు హితులు అయిన శ్రీ గురజాడ వెంకట అప్పారావు, శ్రీ తాతా సుబ్బరాయశాస్త్రి, శ్రీ నిడదవొలు సుందరం పంతులు మొదలగువారు శాసనములనుండి, ధర్మశాస్త్రములనుండి, కావ్యసాహిత్యములనుండి అవశ్యమగు ప్రమాణ వివరములు సేకరించి విజరామగజపతి దత్తతను న్యాయస్థానమునందు నిరూపించారు. ఈ యెక్క సమగ్ర వ్యాజ్యమును దగ్గరుండి జాగ్రత్తగా పరిశీలించి విజయము చేకూర్చిన ఘనత రేవారాణి యశస్వతి జ్ఞానవతి అప్పలకొండయాంబ గారిదని కథనము.
ఇట్లు దత్తతగా వచ్చిన విజయరామగజపతి (1883-1922) గారు 1904 నుండి 1922 వరకూ సంస్థానమును పాలించారు.
ఆయోధ్య ఠాకూర్ దారులలొ ఒకరైన శ్రీ ఠాకూర్ సురాజ్ బాక్షు గారి పుత్రిక లలితాంబను వివాహం చేసుకున్నారు. వీరి వలన అలక నారాయణగజపతి (1902-1937), విజయానందగజపతి ( సర్ విజ్జు ) . అలకనారాయణగజపతి విద్యావతీదేవి పుత్రులు విజయరామగజపతి (పి.వి.జి.రాజు), విశ్వేశ్వరగజపతి. తండ్రి అలకనారాయణగజపతి అకాల మరణానంతరం విజయరామగజపతి గారు జమీందారీని కొంతకాలము పాలించారు మరియూ వీరి కాలమునందే జమీందారీ రద్దు చట్టము వలన విజయనగర సంస్థానము ఆంధ్రరాష్ట్రములొ విలీనమయినది.
కళింగ విజయనగర సంస్థానము (పూసపాటివారు) :
ప్రాగాంధ్రదేశమునగల విశాఖమండలము పూర్వము కళింగసామాజ్యాంతర్గతమై యుండెడిది. విశాఖమండలమున క్రీ. శ. 1713 సం॥న పూసపాటి వంశమునకు చెందిన ఆనందరాజుగారు “విజయపురి" అను గ్రామమును నిర్మించినారు. వీరి కుమారుడు పెద విజయరామగజపతి యీ గ్రామమును “విజయనగరము” అని వ్యవహరింప మొదలిడిరి. పశ్చిమమున నొక మహాసామ్రాజ్యమునకు రాజధానియై, దిగంత విశ్రాంతయశోవిశాలుడయిన శ్రీకృష్ణదేవరాయలుచే పరిపాలింపబడిన హంపీ విజయనగరమునుండి భిన్నవివక్ష చేయుటకు పూసపాటివారి విజయనగరమును కళింగ విజయనగర మనుచుండిరి. ఆనందరాజుగారు 'గాజులరేగా సమీపమున 'మరుచెఱువు' అను ప్రదేశమున గాజులరేగకు సివారుగ విజయపురి గ్రామమును, అదుర్గమును నిర్మాణము గావించిరి. వీరి తనయురు మొదటి విజయరామగజపతి తమ రాజధానిని కుమిలి (కుమిలె-కుంభిళీపురము), పొట్నూరు గ్రామములనుండి విజయనగరమునకు మార్చినారు. ఆనందరాజునకు పూర్వము వీరి జనకవంశమున 10వ పురుషుడును, దత్తతవంశమున 11వ పురుషుడు నైన అమలరాజు బెజవాడ దరి కొండపల్లె సమీపమున 'పూసపాడు' అను గ్రామము నిర్మించెను. నాటినుండియు అమలరాజు వంశమునకు పూసపాటివారను గృహనామ మేర్పడినది. నాటినుండి నేటివరకు వీరి వంశవృక్షము సక్రమముగ నున్నది. వీరి పూర్వచరిత్ర "శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశరత్నాకరము" ప్రధాన గ్రంథమున చర్చింపబడినది.
క్రీ. శ. 1902 సం॥న జరిగిన విజయనగర సంస్థానము వారసత్వపుదావాలో వాదులు, ప్రతివాది ఉభయపక్షములవారిచేతను ఆమోదీంపబడి కోర్టులో దాఖలుచేయబడిన పూసపాటివారి వంశవృక్షములో బసవరాజు పేరు లేదు. కొందఱు చరిత్రకారులు ఇతనిని "పూసపాటి బసవరాజ" అని వ్రాసిరి. మఱికొందఱు బసవరాజు గృహనామము 'పూసపాటి కాదనియు, 'కంఠమరాజు' అనియు ఉటంకించిరి.
వంశావశి: మాధవవర్మ వంశమున కంఠమరాజు (కొమ్మరాజు): వీరి కు॥ అన్నలదేవుడు; వీరి కు॥ సింగరాజు, వీరి కు॥ పెద్దవల్లభరాజు; వీరి కుమారులు (పెద్ద భార్య అన్నలదేవి వలన) సింగరాజు, తమ్మరాజు: తమ్మరాజు కు.లు బసవరాజు, తిరుమలరాజు, వల్లభరాజు. ఈ బసవరాజు ఉదయగిరిని జయించి, కళింగ సామాజ్యాధీశ్వరుడుగు పురుషోత్తమగజపతికి సామంతుడుగు దుర్గరక్షకుడై శక్తి సామర్థ్యములతో పాలించుచుండెను. ఉదయగిరి దుర్గము నెల్లూరుకి 60 మైళ్ళదూరమున 3000 అడుగుల ఎత్తున కట్టబడి బలిష్టమై యుండెడిది. 1513 సం॥ న విజయనగరము కోట కటించిన మొదటి ఆనందరాజునకు బసవరాజు పై పురుషాంతరములలో 11 వ పురుషుడని కొందటి యభిప్రాయము. ఇతడు 1514 సం॥ ప్రాంతమున వీరకృష్ణగజపతికుమార్తె యెల్లమాంబను పరిణయమాడి గజపతివలన 4 పరగణాలు బడసినట్లు ఐరావతీయ కైఫియతులో వ్రాయబడినది. ఈవివాహము సందేహాస్పదము. 1480 ప్ర్రాంతమున దూబగుంట నారాయణకవి అనువదించిన పంచతంత్ర కావ్యమునకు బసవరాజు కృతిభర్త.
అమలరాజు "పూసపాఁడను నగరంబుఁ బోచు కతనఁ బూసపాటి పురాఁకుఁడై పొగడఁబడియె. ఈ వంశమున పూసపాటి అమల రాజునకు తరువాతివారు తెలుగుదేశమును పరిపాలించిన మహారాజులవద్ద సేనాధిపతులుగా నుండి క్రమముగా చిన్నచిన్న ప్రాంతములకు పరిపాలకులైరి. అమలరాజు మనుమడు మొదటి తమ్మిరాజును, ఇతని మూడవ కుమారుడు మొదటి రాచిరాజును హంపీ విజయనగరసామ్రాజ్యమును క్రీ॥శ॥1422 - 1446 సం॥ల నడుమ పాలించిన రెండవ ప్రౌఢ దేవరాయలకడ దండనాయకులుగు నుండి కొన్ని విజయములు సాధించినట్లు తెలియుచున్నది.
మొదటి రాచిరాజు కుమారుడైన రెండవ తమ్మిరాజు కపిలేశ్వర గజపతి నాశ్రయించి కొండవీడు మొదలగు దుర్గములను పాలించెను. మూడవ రావు సర్వజ్ఞసింగభూపాలుని జయించి పెదవీడు పట్టణము నాక్రమించి పెదవీటిచెంత శరణువేడిన బాహాదిఖానుని రక్షించెను. నందపురము, బెల్లంకొండ, సింగరాయకొండ, వాడపల్లి మున్నగుచోట్ల జరిగిన యుద్ధము అన్నిఁటియందును విజయము సాధించి ప్రసిద్ధి గాంచెను వీరి గిరి దుర్గము అనంతగిరి. రెండవ తమ్మిరాజు కాలముననే ఈ వంశమువారికి 'గజపతి' అను బిరుధము ప్రాప్తించినది. ఈతడు పురము జమీందారులగు గజపతులను జయించి వారి బిరుదమును గ్రహించెనని కొందఱు వ్రాసినారు. కాని నదాపురము జమీందారులకు 'దేవ బిరుధమేకాని గజపతి బిరుదము లేదు. కళింగోత్కళ సామ్రాజ్యాధీశ్వరులు మాత్రమే “గజపతి" బిరుదు కలిగియుండిరి. రెండవ తమ్మిరాజు కళింగ వీరప్రతాపరుద్ర గజపతి తనయ అన్నమాంబను పరిణయమాడెను. కళింగ ప్రభువు తమ్మిరాజునకు తన ఆత్మజతోపాటు కొన్ని వరములు, గజపతి బిరుదముకూడ నొనిగెననుట సమంజసము, గ్రాహ్యము. రెండవ తమ్మిరాజు జ్యేష్ఠపుత్రుడు రాచిరాజు కటకేశ్వరునివలన కేతవరం (మొగల్తూరు) బడపెను. 'నవభారత' కావ్యమునకు కృతిభర్త . ఈతడే వసిష్ఠగోతరిక్షత్రియ గృహనామసీసమాలిక కర్త. బారుహమన్నే వృపగండపెండెరము వీరి డాకాల బిరుదు. ఈరాచిరాజు అచ్యుతదేవరాయలవారికి మాతామహుడని 'వరదరాజాంబికాపరిణయము', కొన్ని శాసనములు చెప్పుచున్నవి. పురుషోత్తమగజపతి కుమారుడగు ప్రతాపరుద్ర గజపతి కళింగోత్కళ రాజ్యములేకాక పశ్చిమమున వినుకొండ, కొండవీడు, బెల్లముకొండ, నాగార్జునకొండ, అద్దంకి, అమ్మనబోలు, తంగేడు, కేతవరము, ఉదయగిరి, రాజమహేంద్రవరము మున్నగు దుర్గము లనుకూడ తన స్వాధీనములో నుంచుకొని పరిపాలించుచుండెను. కేతవరపురాధీశ్వరుడగు రాచిరాజునకు తన కుమార్తెనిచ్చి వివాహముచేసెను. క్రీ.శ.1513 సం॥ న శ్రీకృష్ణదేవరాయులు కళింగ రాజ్యమును జయించెను. మంత్రి తిమ్మరుసు జేతకును విజితునకును సంధి సమకూర్చి గజపతి కుమార్తె యగు తుక్కాంబను రాయలకిచ్చి వివాహము చేయిఁచెను. ఈమె పేరు భద్రాంబ యని కొందఱు వ్రాసినారు. ప్రతాపరుద్ర గజపతి కుమారుడు వీరభద్రగజపతు కొండవీటి దుర్గమున రాజప్రతినిధిగా నుండెను. క్రీ. శ. 1515 సం॥లో శ్రీకృష్ణ దేవరాయలు ఆ దుర్గమునాక్రమించి వీరభద్రగజపతిని అతనితోపాటు అందున్న రాచిరాజును జీవగ్రాహముగా పట్టుకొనెను. రాచిరాజు రాయలకు షడ్గకుడు. రెండవ తమ్మిరాజు ద్వితీయపుత్రుడు తిప్పరాజు వంశము వృద్ధియైనది. వీరి జ్యేష్ఠపుత్రుడు పెదకృష్ణమరాజు తిరుమలరాజు వాసభూపతి తనూజ తిమ్మమాంబను ఉద్వాహవయ్యెను. తిప్పరాజు ద్వితీయ పుత్రుఁడు రాచిరాజు. వీరపుత్రుడు కృష్ణమరాజు రుక్మిణీపరిణయము కృతిభర్త. వీరి ద్వితీయ భార్య గజపతికి సన్నిహిత బంధువుడగు జయ్యనపుత్రి ఎల్లమాంబ. వీరి రెండవకుమారుడు గోపాలరాజు. గోపాలరాజు ఏకైకపుత్రుడు గోపాల కృష్ణమరాజు. వీరి రెండవకమారుడు తమ్మిరాజు (తమ్మభూపాలుడు) శ్రీకృష్ణవిజయము గ్రంథకర్తగా వాసికెక్కెను. ఈ గ్రంథము కొత్తలంక మృత్యుంజయకవి రచించి ధనాశాపీడితుడయి తమ్మభూపాలునిపేర వెలయించెనను వాదము కలదు.
శ్రీ దువ్వూరి జగన్నాధశర్మ గారు 'విజ్జయనగరం గజపతిమహల్’ అను గ్రంథమున ఈ క్రింది విధముగ వ్రాసియున్నారు: శ్రీకృష్ణదేవరాయల పిత నరిసింహదేవరాయల భార్యలందొక్కామె పూసపాటి రాచిరాజుగారి పుత్రికయైయున్నది. కృష్ణరాయల అల్లుడగు పూసపాటి శివరామరాజు గారి సంతతివారిలో
1.అప్పలరాజు, 2. చిన్నయరాజు, 3. కృష్ణమరాజు, 4. గోపాలరాజు అనువారు తమిళరాజ్యమున రాజపాళయం క్షత్రియవఁశస్థుల వేయిళ్ళమొదలై వర్ధిల్లిరి. శర్మగారు తమ పరిశోధనకు ఆధారములు తెలియజేయలేదు. ఇది నిజమైన యెడల రాజపాళయం పూసపాటివారు కృష్ణదేవరాయల దౌహిత్రుల వంశమువారైయ్యుందురు. ఏది ఎట్లైనను పూసపాటివారిలో కొందరు విజయనగర సామ్రాజ్యమనను, మఱికొందరు గజపతుల కడమ ఉండి రాజకీయ పరిస్థితులను బట్టి విజయనగర కర్ణాటకులతోడను, ఉత్కళ ఓఢ్రుల తోడను బాంధవ్యము నెఱపిరనుట సత్యము,